ముక్కుతో కూడా తినవచ్ఛు
Volume 3 | Issue 6 [October 2023]

ముక్కుతో కూడా తినవచ్ఛు<br>Volume 3 | Issue 6 [October 2023]

ముక్కుతో కూడా తినవచ్ఛు

రచన: గీతా విశ్వనాద్

Volume 3 | Issue 6 [October 2023]

అనువాదకులు: దేవులపల్లి కోటేశ్

అమ్మ మంచం పట్టిన బాధాతప్త స్థితి చాలదన్నట్లు, వారికి ముక్కుద్వార ఆహారాన్నిఅందించాలని మాకు డాక్టర్ సూచించడం మరీ విచారకరం. మా అమ్మకు నేనే ప్రధాన సంరక్షకురాలిగా, అందుకు నా మొదటి స్పందన ఏదైనా ఉందంటే, దానిపై నేను, నా అసహ్యాన్ని వెలిబుచ్చచడమే. జీవితంలో అతి ఎక్కువ బాగం గవత జ్వరం, లేదా జలుబు సంభంద అల్లర్జీ తో బాధపడిన నేను, ముక్కును, నన్ను అనునిత్యం వేధించిన, చీమిడిని స్రవించే ఒక అవయవంగా మాత్రమే చూశాను. చీమిడి అనేది పసుపు-ఆకుపచ్చ మిశ్రమ వర్ణములో ఉండే జిగట స్వబావంగల ఒక అసహ్యకరమైన ద్రవం, మరియు దానిని tissue, లేదా, కాగితంతో చేసిన చేతిరుమాలులో విచక్షణతో చీది, బయట పడేయాలి. మా అమ్మ నేర్పిన ఈ విధంగా ముక్కు చీదే సంస్కారం, మరియు దాని క్రమం కూడా ఒక వర్గ సమాజాన్ని, మరియు ఆ వర్గపు పెంపకాన్ని సూచిస్తుందని నాకు తరువాత కాలంలో మాత్రమే అర్థమైంది. ముక్కుని, లేదా మరీ ముఖ్యంగా దాని రూపాన్ని, తరచుగా అందానికి ప్రధాన కొలమానంగా చూస్తారు. ఈ ధోరణి, ప్రత్యేకించి భారత ఉపఖండంలో మరీ ఎక్కువ. మరీ కురచగాను, లేదా మరీ పొడవుగాను కాకుండా, అదేవిదంగా గుండ్రంగాను, లేదా సన్నని కొనదేలినట్లుగాను లేకుండా, ఒక వ్యక్తి యొక్క అందాన్ని అంచనా వేయడానికి ఈ ముక్కుకు సంభందించి కొన్ని ఖఛ్చితమైన ప్రమాణాలను పాటిస్తున్నారు. ఇది ఆడవారి విషయంలో మరీ ఎక్కువ. ఆ విధంగా, నా గుండ్రటి ముక్కు కేంద్రంగా, నేనూ తరచుగా అవమానించబడినదాన్నే. ఇక్కడ నేనూ సంక్షిప్తంగా చెప్పదలిచేదేమిటంటే, ముక్కు నా దృష్టిలో ఒక అసహ్యకరంగాను   మరియు అసౌకర్యంగాను ఉండే అవయవమే తప్ప, మరేమీ మరెన్నటికీ కాదు. ఈ నేపథ్యంలో, అలాంటి అసహ్యకరమైన పరిస్థితినుండి బయట పడడం, మరియు, పోలీవినైల్ క్లోరైడు (PVC)తో తయారు చేయబడిన ఒక గొట్టం ముక్కులోనుండి వేలాడుతుండగా, ఆసుపత్రిలో చికిత్స పొంది తిరిగివఛ్చిన అమ్మకు ఆహారం తినిపించడమంటే, అది నాకు ఒక పెద్ద సవాలుగానే మారింది.  అది మనం ఇష్టపడి, ఆదరించే ఆహారమే అయినప్పటికీ, దానిని ముక్కుద్వారా (గొట్టం ఉన్నప్పటికీ) సేవించినట్లైతే, దానిని ఆహారమని ఎలా అనవచ్చ్చునని నాకు ఒకింత ఆశ్చర్యం కలుగుతుంది. ఏమైనప్పటికీ, అప్పుడు నేను సామెతలయొక్క జ్ఞానాన్ని ఆశ్రయించ పూనుకున్నాను, మరియు ”నయము కానీ రోగాన్ని భరించక తప్పదు” అనే జీవన సత్యాన్ని గుర్తుచేసుకున్నాను.


Artwork – Gita Viswanath

అప్పుడు నేను డాక్టరును అడిగిన ప్రశ్నలలో ఒకటి, “డాక్టర్, ఈ గొట్టం శాశ్వతంగా ఉండిపోవలసిందేనా?” అని. దానికి వారి సమాధానం విని నా గుండె బ్రద్దలైనట్లనిపించింది. స్పర్శలాగే, రుచికూడా ఒక అతి సంతృప్తికరమైన భావనగా పరిగణించవచ్చ్చును. ఈ ముక్కుద్వార ఆహారాన్ని అందించడమంటే, రుచిద్వారా కలిగే సంతృప్తిని నిరాకరించడమే, అని నాకు స్ఫురించింది. అప్పుడు అమ్మను బలిస్తున్నట్లుగా నాకు తోచింది. ఇక అమ్మ తనకు ఇష్టమైన పచ్చ్చళ్ళు, మరియు ఆంధ్ర-కర్ణాటక చట్నీలను ఎప్పుడు, మరియు ఎలా అనుభవించగలదు? అనేక రకాలుగావున్న ఈ పచ్చ్చడిని బీరకాయ తొక్కలతో కూడా తయారుచేయవచ్చ్చు. ఇప్పుడు అమ్మను కాపాడుకోవడానికి, మరియు తనకు తగినంత శక్తిని సమకూర్చడానికి, గొట్టానికి చివరన అమర్చిన గరాటు గుండా ప్రతి రెండు గంటలకు ఒకసారి పోషక మిశ్రమాన్ని అందించాల్సిందే. క్రమంగా, అమ్మ స్మారకస్థితిలోకి రావడాన్ని చూసిన ఆనందంలో, ముక్కుద్వారా ఆహారాన్ని తీసుకోవడంపై వుండే నా విముఖత కాస్త తగ్గింది.

అప్పుడు, ఆహారం కడుపును చేరడానికి ముక్కు కూడా ఒక ప్రత్యామ్నాయ మార్గంగా, మరియు చివరగా అది మనల్ని సంరక్షించేదిగా నా ఆలోచనలను మలిచాను. నోటిద్వారా కాకుండా, సరాసరి జీర్ణాశయంలోకి ఆహారాన్ని చేర్చే విధానాన్ని గ్రీకు మరియు ఈజిప్తు దేశాలలో 3500 సంవత్సరాలకు పూర్వమే పాటించినట్లు చారిత్రిక ఆధారా లున్నవి. హిప్పోక్రేట్స్ అనే వైద్యుడు మల మార్గంలో ఒక గొట్టాన్ని ప్రవేశపెట్టి, దాని ద్వారా గొడ్డు మాంసపు పులుసు మరియు గుడ్డులోని చిలికిన తెల్లని సొన వంటి పోషక రూపాలను జీర్ణాశయానికి చేర్చేవాడని తెలుస్తున్నది. ముక్కుద్వారా ఆహారాన్ని అందించే విషయానికి వస్తే, ముక్కు కనీసం నోటికి ప్రక్కనే ఉండే మరో అవయవం. కానీ, మల మార్గం గుండా ఆహారం, అంటే అది సరిగ్గా దానికి మరో చివరినుండి. దుర్వాసనతో రోతపుట్టించే మన శరీరంలోని ఈ భాగం గురించి, మాట్లాడడానికి కూడా ఇబ్బందికి గురికావాల్సిన అవయవంగా అన్ని సంస్కృతులలోనూ పరిగణించబడుతున్నది. అమెరికా దేశ 20 వ అధ్యక్షుడైన జేమ్స్ గార్ఫీల్డ్ ను, బహుశా, ఈ రకమైన చికిత్స పొందినవారిలో ప్రముకమైన వ్యక్తిగా గుర్తించవచ్చ్చు. 1881 లో ఒక హత్యాయత్నంలో తుపాకీ గుండుతగిలి గాయపడిన వీరికి, ప్రతి నాలుగు గంటలకొకసారి, సుమారు 80 రోజులపాటు గొడ్డు మాంసపు పులుసు మరియు విస్కీని ఈ విధానంలో అందించారు. మైనము మరియు పిండి పదార్థము, బ్రాందీ మరియు ద్రాక్ష సారాయితో కలగలిపిన పొగాకు మరియు మాంసపు ద్రావణాన్ని మలమార్గం గుండా ప్రవేశపెట్టే ఈ విధానం 1940 వ సంవత్సరం వరకు కొనసాగింది. సరాసరి జీర్ణాశయంలో ఆహారాన్ని చొప్పించే విధానాల్లో ముక్కుద్వారా ఆహారాన్ని అందించడమే,నేడు అతి సాధారణమైన విధానంగా కొనసాగుతున్నది. 18 వ శతాబ్దంనుండి కొనసాగుతూ వఛ్చిన ఇత్తడి తొడుగుగల గొట్టం స్థానంలో పాలీ వినైల్ క్లోరైడ(PVC) తో చేసిన మరో గొట్టాన్ని జాన్ ఆల్ఫ్రెడ్ రైల్ ప్రవేశపెట్టడంతో, దానిని రైల్ ట్యూబ్, లేదా NGT గొట్టము పేరుతొ, అనగా ముక్కునుండి జీర్ణాశయం వరకు ఉండే గొట్టాన్ని, నేడు ఉపయోగిస్తున్నారు.


Artwork – Gita Viswanath

ఆహారం అనేది పంచేంద్రియాలన్నింటికీ సంభందించిన సంపూర్ణమైన ఇంద్రియ అనుభవమే అయినప్పటికీ, రుచి మాత్రం నాలుకకు సంభందించిన అంశం. దీని మంచి, చెడు, రుచికరం, చప్పదనం, తదితర అంశాలను తేల్చాల్సినది, అంతిమంగా నాలుకే. చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అతి అతి పుల్లదనం కారణంగా, లేదా సువాసనలను వెదజల్లుతున్నప్పటికీ అతి ఉప్పదనం కారణంగా, ఆహారంపై విముఖత చూపడం అసాధారణం ఏమీ కాదు. పంచేంద్రియాలన్నింటిలో, రుచి అనే ఇంద్రియం మాత్రమే మన శరీరంలో అంతర్లీనంగా ఉంటుంది. ఇతర ఇంద్రియాల లాగ, ఇది శరీరానికి బయట ఉండే ఇంద్రియం కాదు.  ఉదాహరణకు, మనం ప్రక్రుతి దృశ్యాన్ని చూసి అది అందంగా ఉంది అని అంటాం; ఒక సంగీతాన్ని విని, మనం అది శ్రావ్యంగా ఉంది అని అంటాం; మనం ఒక సిల్కు చీరను ముట్టుకొని అది మృదువుగా ఉంది అంటాం. కానీ, మనం ఆహారాన్ని చూసి మాత్రం, అది రుచికరంగా ఉందని చెప్పలేం. దాని రుచి మనకు తెలియాలంటే, మనం దానిని తప్పకుండ మన నోటిలో పెట్టుకొని తీరాల్సిందే. రుచికి సంభందించి, దీనివలన మనకు బోధపడిన సత్యం ఏమిటంటే, రుచి శరీరానికి అంతర్లీనంగా ఉండడం మూలంగా, బహుశా, అది ఒక అత్యంత స్వీయాత్మిక అనుభవంగా ఉండి ఉంటుంది.

ఉదాహరణకు, మనం అనునిత్యం తినే పప్పు, అన్నం మనం ఆకలిగా ఉన్నప్పుడు రుచికరంగా ఉంటుంది. రుచి అనేది ఆయా వ్యక్తుల శారీరక అవసరాలకు సంభందించినది కూడా. కాల్షియం లోపంగల బిడ్డకు, మరియు ఆ బిడ్డలో కలిగిన సుద్దముక్కను తినాలనే వాంఛకు గల అంతః సంభందాన్ని ఏ రకంగా వివరించగలం? ఇక్కడ నేను చెప్పేదేమంటే, లాలాజల గ్రంధులు, రుచి గ్రాహకాలు మరియు రుచి మొగ్గలను గురించిన శాస్త్రీయ సిద్ధాంతానికి ఆవాలనే, ఈ రుచికి సంబంధిన అంశం దాగి ఉన్నది.

ఒక రోజు, అమ్మ స్పృహలోకి వఛ్చి కాస్తంత మెరుగుపడ్డాక, అకస్మాత్తుగా, తనకు చారన్నం కావాలని కోరింది. ఆ ఆనందంలో, నాకు నాట్యం చేయడం ఒకటే తక్కువ.  కందిపప్పు మరియు టమాటాలతో పాటు, వేగించిన ధనియాలు, జిలకర, ఎండు మిరపకాయలు, మిరియాలు కలగలిపిన మసాలా పొడితో తయారు చేసిన పలుచని చింతపండు రసం, ఒక ప్రసిద్ధి చెందిన దక్షణ భారత వంటకం.  చారు/రసం/సారు తదితర పేర్లతో పిలువబడుతూ, దక్షణ భారత రాష్ట్రాల అన్ని సరిహద్దులను దాటి, ఇది అనేక వైవిధ్యాలతో తులతూగుచున్నది. నెయ్యిలో గోలించన ఆవాలు, ఇంగువ, మరియు కరివేపాకులో ఈ రసాన్ని చేర్చడంతో, ఇది దివ్యమైన సువాసనను వెదజల్లుతుంది. కర్ణాటకలోని తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలలో పప్పును మినహాయించి చేసే రసం, అనేక రూపాలుగా ఉనికిలోకి వచ్చింది. అవి; చించారు, టమాటా రసం, నిమ్మ రసం, వెల్లిపాయ రసం, కోకుం సారు, మరియు మజ్జిగ చారు. ఆరోగ్యాన్ని పునరుద్ధరించే ఈ ద్రావణాన్ని గూర్చి చర్చ వచ్చ్చినప్పుడు, ఘర్షణ పూరిత వాతావరం నెలకొని, కొన్నిసార్లు కుటుంబాలు విడిపోయే ప్రమాదాలు కూడా సంభవిస్తాయి. కొబ్బరిని ఉపయోగిస్తారనే కారణంగా మైసూరు ప్రాంతంలో చేసే రసాన్ని తిరస్కరిస్తూ, ఆ రకమైన రసాన్ని చేసేవారిని అసమర్దులుగా తులనాడుతారు. రసంలో వెల్లిపాయలు వేశారనే ఆలోచనవస్తేనే బ్రాహ్మణులు ముక్కుమూసుకుంటారు, మరియు, అదే స్వచ్ఛతా వాదులైతే పైన్ ఆపిల్, మునగ కాయలు, తదితరాలతో చేసే వైవిధ్యభరితమైన  ప్రయోగాలను ప్రతిఘటిస్తారు.

ఈ రసం మోసుకువచ్ఛే భయంకరమైన జిహ్వ చాపల్యాన్ని తీర్చడానికి, నేను పరిపూర్ణమైన రసాన్ని తయారుచేసి అమ్మకు ముక్కుద్వారా తినిపించే సాహసానికి ఒడిగట్టాను. అమ్మలో చివరకు ఏదోఒకటి తినాలనే కోరిక కలగటం నాకు సంతోషం. అన్నం మరియు రసాన్ని మిక్సీలో వేసి, జావలాగా మెత్తగా రుబ్బి, ఆ రబ్బరు గొట్టం (NG ట్యూబ్) ద్వారా తినిపించాను. ఇది చూసి, రైల్స్ తన సమాధినుండి లేచి అటు ఇటు కదలాడి ఉంటాడనే భావన నాకు కలిగింది. అమ్మ తన రుచిని ఆస్వాదిస్తూ, ‘రుచిగా ఉంది’ అంటూ తన సంతృప్తిని వెలిబుచ్చచడంతో, నేను ఒక క్షణం పాటు చెలించి పోయాను. అప్పుడు నేను వెంటనే, ఆహారం నుండి వచ్ఛే సువాసన దాని రుచిని రెట్టింపు చేస్తుందనే నిర్ధారణకు వచ్చాను. కాబట్టి, బహుశా అమ్మ, ఆ ఆహారపు వాసను చూసి, రుచి అనుకుని పొరపడుతుందేమోనని అనుకున్నాను. అయినప్పటికీ, దానిని ఆమె రుచి అని ఎందుకు పిలిచినట్లు?  అప్పుడు ఆమె, దానిని ‘మంచి వాసన వస్తుంది’ అని అనిఉండవచ్చూ కదా! మన నాలుక ఉపరితలంపై ఉండే రుచి మొగ్గలతో ఆహారం కలిసినప్పుడు, నాలుక, అన్నవాహిక, దవడ మరియు ఉపనాలికల ఉపరితలాలపై ఉండే రుచి గ్రాహికల ద్వారా మాత్రమే రుచి ఉత్తేజం చెందుతుంది. రుచి మొగ్గలపై ఉండే రుచిగ్రాహకాలు ఐదు ప్రాధమిక రుచులను గ్రహిస్తాయి. అవి, తీపి, ఉప్పదనం, పులుపు, చేదు, మరియు ఉమామి. దీనిలో చివరిదైన ఉమామి రుచి, మాంసము, జున్ను, సోయా సాస్ వంటి తదితర ఆహారపదార్థాలలో ఉండే గ్లుటామేట్ అనే అమీనో ఆమ్లం వలన కలుగుతుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేమంటే, కారం ఒక రుచి కాదు. అది కేవలం, మిరప కాయలు మరియు మిరియాలు వంటి వాటిలో ఉండే, కాప్సాసిన్ అనే రసాయన సమ్మేళనానంతో, మన నరాలు జరిపే ప్రతిస్పందన మాత్రమే.

ఐతే, ఈ చారన్నాన్ని అమ్మ ఎలా రుచి చూసివుంటుంది? అప్పుడు, నేను అమ్మతో “ఆ రసం వాసన నీ ముక్కు రంధ్రాలను చక్కిలిగింతలకు గురిచేసిందా”, అంటూ ఆటపట్టించడం మొదలు పెట్టాను. దానికి స్పందనగా అమ్మ నవ్వింది. మనము ముక్కుతో తిన్నట్లైతే, అది భాషపై ఎలాంటి ప్రభావాన్ని చూపెడుతుంది? సాధారణంగా చంటి పిల్లలకు మన శరీరంలోని వివిధ భాగాలను వేలుతో చూపెడుతూ, వాటిని వారికి బోధిస్తుంటాము. తరువాత, ఆయా శరీర భాగాలు నిర్వర్తించే పనులను కూడా వారికి బోధిస్తాం. “మనం కళ్ళతో ఏమి చేస్తాము?” అని అడగగానే, బిడ్డ, “చూస్తాం” అని జవాబు ఇస్తారు. కావున, ఈ బోధన వివిధ భాగాలలో కొనసాగుతుంది. “మనం మన ముక్కుతో ఏమి చేస్తాం” అనే ప్రశ్నకు, బిడ్డ ఒకవేళ ‘తింటాం’ అని సమాధానం ఇఛ్చినట్లైతే, అది తప్పవుతుంది.  కొన్ని నెలల క్రితమైతే, నేనుకూడా ఇదే చేసిఉండేదాన్ని. కానీ, బిడ్డ ఇఛ్చిన సమాధానం ఏమాత్రం అసంబద్ధమైనది కాదు. మనం ఇప్పుడే గుర్తించినట్లు, ఇక్కడ ముక్కుద్వార తినే ఒక విధానం ఉనికిలో ఉంది. అయితే, అమ్మ గుండె జబ్బుతో మంచం పట్టినప్పటి నుండి ఆ విధానం నా స్ఫురణకు వచ్చింది. అలాగే, “నోటిలో నీళ్ళూరడం” వంటి పదాల విషయంలో ఏమి జరుగుతుంది? దీనిని, ఆహారం వేడిగావుంది అని భావించినప్పటికీ, “ముక్కులో నీళ్లూరటం” అని అనవచ్చ్చా? “నోరు కాలింది”, అనే దాన్ని, “ముక్కు కాలింది” అని అనవచ్చ్చా? మీరు ఎవరితోనైనా అసంతృప్తికి లోనయినట్లయితే, “నా ముక్కులో చెడ్డ రుచిని మిగిల్చారు” అని అనవచ్చ్చా?  మీరు ఇప్పటి వరకు తిన్న అన్ని మాంసాలలో అత్యంత లేత మాంసాన్ని ఎలా వర్ణిస్తారు?  “అబ్బా! అది నా ముక్కులో కరిగిపోయింది, అని వర్ణిస్తారా? నాలుక తన నోటితో, రుచిపై ఆధిపత్యం చలాయిస్తున్నట్లుగా, భాషలో చాలా స్పష్టంగా ప్రతిభింభించబడుతున్నది.

అమ్మ తన అంతిమ చేతనావస్థనుండి రసానికి చెందిన రుచిని గుర్తుకు తెచ్చుకుని ఉంటుందా?  రుచికి చెందిన జ్ఞాపకాలను మెదడు నిలువ చేసుకోగలదా? ఒక ప్రదేశానికి సంభందించిన అందాన్ని దృశ్యమానంగావించుకుని, తిరిగి దానిలో జీవించటం, మన అందరి అనుభవంలో ఉన్నవిషయమే. అయితే, రుచిని తిరిగి మనం పొందగలమా? మెదడులో చూపు మరియు వినికిడికి సంభందించిన కేంద్రాలున్నట్లే, రుచికి సంభందించిన కేంద్రం కూడా మన మెదడులో ఉందా? రుచి మొగ్గలు మన రుచిని ఉద్దీపనం చేస్తాయన్న విషయం మనకు చాలా కాలంగా తెలుసు. కానీ, వివిధ ఇంద్రియాలు మన మెదడులోనే వాటికి చెందిన ప్రత్యేకమైన కేంద్రాలలో నమోదు చేయబడి ఉంటాయన్న విషయం మనం ఇంకా గుర్తించ వలసి ఉన్నది.  MRI స్కానింగ్ ఉపయోగంలోకి రావడంవల్ల, మానవ మెదడులో రుచి కేంద్రం ఉన్నట్లు గుర్తించడంలో, ఆ సాధనం పరిశోధకులకు ఎంతగానో తోడ్పాటునందించింది. కార్నెల్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆడం ఆండర్సన్ అనే ఆచార్యుడు చెప్పినట్లు, “మన భాహ్యఇంద్రియాలకు బాహ్యంగా కణజాలాలున్నట్లు, మనకు చాలా కాలంగా తెలుసు. కానీ, మానవ మెదడు పైభాగంలో, అంతరంగా, రుచికి సంభందించిన ఒక పలుచని పొరని గుర్తించినట్లు ఇప్పుడు మనకు బలమైన ఆధారాలు లభిస్తున్నవి.[i] ” అయినప్పటికీ, ఇది నాలుక గుర్తిస్తున్న రుచికి సంభందించిన భాగానికి లోబడే ఉన్నది. నా అనుమానాలు ఇంకా నివృత్తి కాబడలేదు: నాలుకను తప్పించి, ముక్కుద్వార ఆహారాన్ని అందించటం వంటి ప్రక్రియలకు పూనుకుంటే ఏమి జరుగుతుంది? అప్పుడు కూడా, తీపి, పులుపు, చేదు, ఉప్పదనం వంటి రుచికి సంభందించిన సంకేతాలను మన మెదడు గ్రహిస్తుందా?

చాలామంది భావిస్తున్నట్లు, రుచిని బహుశా అమ్మ సంకుచిత భావంతో గుర్తించడం కాస్త విరమించుకొని ఉంటుంది. నేడు ఆమెకు రుచి శరీర ధర్మానికి సంభందించిన యాంత్రిక ప్రక్రియ కంటే ఉన్నతమైనదని నేను భావిస్తాను. రసం ఆమె చిన్నతనం నుండి, తమ రోజూవారీ ఆహారంలో తప్పనిసరి భాగంగా ఉంటూ వచ్చింది. నా పసితనములో అమ్మ రసాన్ని అన్నంతో కలిపి, మెత్తటి ముద్దలుగా చేసి, ఇది నాన్నకు, ఇది అమ్మకు, ఇది పక్షికి, ఇది కుక్కకు, ఇది ఆవుకు, అంటూ అనేక అంశాలపై నా దృష్టిని మరలిస్తూ, నాకు గోరుముద్దలు తినిపించేది. సాంబార్-అన్నానికి మరియు పెరుగు-అన్నానికి మధ్యలో రసం-అన్నాన్ని తినడం ఒక కఠినమైన నిబంధనగా దక్షణ భారత గృహ సాంప్రదాయక పద్దతిలో ఉంది. రసాన్ని దానికి కేటాయించిన ఒక ప్రత్యేక పాత్రలో పోసి, దానిని వంటగది వేదికకు కుడిచేతి వైపున ఉన్న రెండవ అరలో అమర్చేవారు. మనస్సుని అబ్బురపరిచే విధంగా రసాన్ని అమ్మ అత్యంత స్థిరమైన ప్రమాణాలతో తయారు చేసేది. వీటన్నింటితో పాటు మరెన్నో తన మెదడులో నిక్షిప్తవడం వల్ల మాత్రమే, ముక్కుద్వార వెళ్లినప్పటికీ, రసం-అన్నం రుచిని అమ్మ తిరిగి ఆస్వాదించగలిగిందని నేను భావిస్తాను. అమ్మ తన అర్ధ-చేతనా స్థితిలో రుచికి సంభందించిన నాలోని అనేక సాంప్రదాయక ఆలోచనలను అన్నింటిని తొలగించి, ఆహారాన్ని అనుభవించడం, ఆనందించడం, మరీ ముఖ్యానంగా ఆహారాన్ని గుర్తుంచుకోవడం లాంటి వివిధ ప్రక్రియలకు సంభందించిన విశాల పరిజ్ఞానాన్ని నాకందించడానికి కావలసిన అనేక మార్గాలను చూపించింది.

డాక్టర్ అంచనాలనన్నింటినీ తారుమారు చేస్తూ, అమ్మ తనకు NG గొట్టం అవసరమే లేనంతగా కోలుకుంది. కానీ దురదృష్టవశాత్తు, నేడు అమ్మ ఏ రుచిని గుర్తించలేక పోతున్నానని తన బాధని తెలియజేసుకొంటున్నది.

[1] Anderson, Adam: “Distinct Representations of Basic Taste Qualities in the Human Gustatory Cortex,” in Stephen D’Angelo. “The sweet spot: research locates taste center in brain.” https://news.cornell.edu/stories/2019/03/sweet-spot-research-locates-taste-center-brain

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

oneating-border
Scroll to Top
  • The views expressed through this site are those of the individual authors writing in their individual capacities only and not those of the owners and/or editors of this website. All liability with respect to actions taken or not taken based on the contents of this site are hereby expressly disclaimed. The content on this posting is provided “as is”; no representations are made that the content is error-free.

    The visitor/reader/contributor of this website acknowledges and agrees that when he/she reads or posts content on this website or views content provided by others, they are doing so at their own discretion and risk, including any reliance on the accuracy or completeness of that content. The visitor/contributor further acknowledges and agrees that the views expressed by them in their content do not necessarily reflect the views of oneating.in, and we do not support or endorse any user content. The visitor/contributor acknowledges that oneating.in has no obligation to pre-screen, monitor, review, or edit any content posted by the visitor/contributor and other users of this Site.

    No content/artwork/image used in this site may be reproduced in any form without obtaining explicit prior permission from the owners of oneating.in.