అనువాదం: దేవులపల్లి కోటేశ్
అవి ‘శోవద్దివడ్డీ’ అనే ఒక సంగీత పునరుజ్జీవన వాద్య బృందం పాప్ సంగీతప్రపంచాన్ని ఏలుతున్న రోజులు. లీడ్స్ నగరానికి తూర్పుదిక్కున సీక్రోఫ్ట్ ఆసుపత్రి సమీపంలో అతినిరాడంబరంగా, పాక్షిక ఏకాంతంలో నిర్మించుకున్న మా ఇంటి కిటికీ అద్దాలను ఇటుకపెళ్లలు పలుమార్లు బద్దలుకొడుతున్నప్పటికీ, ఆ బృంద పాప్ సంగీతంపు గ్రామ ఫోన్ రికార్డును కలిగిన వాడిగా గర్విస్తూండగా, వారి ఒకేఒక్క అతి ప్రాచుర్యం పొందిన Under the Moon of Love అనే పాట, నన్నూ మరియు నా మూలధాతువును, దాని సృజనాత్మకతతో ఆవరించింది. అవి 1970 చివరి రోజులు. ఇనోక్ పావెల్ అనే బ్రిటిష్ సాంప్రదాయవాద శాసనసభ సభ్యుడి ‘రక్త నదులు’ (Rivers of Blood) అనే దుమారం రేపిన అతి హేయమైన బహిరంగ ఉపన్యాసం ప్రవాసీయుల మరియు వీధిరౌడీల మెదళ్లలో ఇంకా మెదులుతూనే ఉంది. ఇంగ్లాండ్ కు ఉత్తరాన ఉన్న శ్రామిక వాడల పరిసరాలు ఎడతెరిపిలేకుండా అట్టుడికి పోతూనే ఉన్నాయి. పగిలిన కిటికీలు మరమ్మత్తు చెయ్యబడ్డాయి. ఫిర్యాదులు చెయ్యబడ్డాయి. చివరగా జీవనం తిరిగి శాంతించింది. నాకు గుర్తున్నంత వరకు అప్పుడు నేను ప్రాథమిక పాఠశాల పిల్లవాన్ని. అప్పటికే పాప్ సంగీతంపై నాకు మక్కువ పెరిగింది.
వీటన్నింటి మధ్యనుండే, మా అమ్మ తన మాతృభూమి కమ్మదనాన్ని ఆవిష్కరించే పనికి పూనుకున్నది. ఇది ప్రతిఒక్క ప్రవాసీయుడు చేయదగ్గ పనే. అది చేసే మేలేమీ తక్కువ కాదు. మర్మగర్బంగా ఉన్న దాని ఇంద్రియ శక్తి, ఖండాంతర దూరాలను కరిగించి అక్కడున్న భయంకరమైన చలినుండి, భవిష్యత్తుపైవున్న అనిఛ్చితినుండి, వివక్షాపూరిత జాతుల ఉద్రిక్తతల నుండి కనీసం తాత్కాలిక ఉపశమనాన్నైనా యిస్తుంది. భారతీయతకు సరితూగే వంటసామాగ్రీ, మంచి వస్త్రాలు మరియు దైనందిన భాషా అవసరాలతో పాటు, మన ఆంధ్రులు చేసే నిత్యజీవన ఆరాటంలో ఊరగాయ మరియు పచ్చడి వారి వంటగదిలోని కేంద్రస్థానాన్ని ఆక్రమించుకుంది. ఈ రెండింటిలో ఊరగాయను సుదూరంగావున్న హైదరాబాద్ నగరం నుండి సీలు చెయ్యబడ్డ జాడీలలో తీసుకొనిరాగా, పచ్చడిని మాత్రం ఇక్కడే చెయ్యవలసి వచ్చేది. దానికి సరితూగే సామాగ్రి అందుబాటులో లేకపోవడంతో, స్థానికంగా దొరికే Bramley అనబడే సేపుకాయలతో (వంటకోసం ప్రత్యేకంగా వాడుతారు) సర్దుబాటుచేసి మా అమ్మ ఈ పచ్చడిని రూపొందించేది. ఆ కాయల పైనుండే తొక్కని ఒలిచి, సన్నగా తరిగి, మెంతులు, ఆవాలు, పచ్చి మరియు ఎండు మిరప కాయలతో పాటు, దానికి సరితూగే మోతాదులో ఉప్పుని మరియి కొద్దిపాటి చెక్కరను చేర్చి బాగా కలపాలి. దానిలో కొద్దిగా మినుప పప్పుని మరియు చిటికెడు ఇంగువాను కూడా చేర్చాలి. అన్నింటికంటే ముక్యంగా దానికి సంపూర్ణతను సంతరించే, నల్లని, రుచికరమైన చింతపండు గుజ్జును, లేని పక్షంలో ప్రత్యామ్నాయంగా నిమ్మరసాన్ని చేర్చి బాగా కలపాలి. వంటలకు సంబంధించినంత వరకూ, మంచి రంగు, సువాసనలను వెదజల్లే పులుపు మరియు కారం మేళవించిన ఆహార పదార్థము ఏదైనా ఉందంటే, అది ఖచ్చితంగా ఈ పచ్చడే. అదే అన్ని వంటకాలోకెల్లా అగ్రస్థానంలో నిలిచి, తన గుబాళింపులతో మనల్ని ఆహననం చేసుకొని మనకు ఆనందాన్ని, అస్థిత్వాన్ని మరియు ఓదార్పును ఆవిష్కరిస్తుంది. ఇటీవల, బాల్టిమోర్ నగర శివారులో ఉన్న మా మేనత్త ఇంటి పెరట్లో ప్రేమతో సాగుచేసుకున్న గ్రీష్మ కాలపు పంటైనా గోంగూరను కోయటంలో నేను కొంత సహకరించాను. ఆ ఆకులో కొంత న్యూయార్క్ లో ఉన్న మా అక్క(పెదనాన్న కూతురు)కు పంపించడం జరిగింది. అనేక పులుపు మరియు కారపు దినుసులతో సమ్మిళితమైన ఈ ఆంద్ర ప్రధాన ప్రతినిధి (గోంగూర పచ్చడి) సాధారణంగా ప్రతీ ఇంటా, ప్రతి చిన్న హోటల్లోనూ లభ్యమయ్యేదే. వివాహాది తదితర విందులలో దాని ప్రత్యేకత గురించి చెప్పవలసిన పని లేదు. మా అమ్మలాగే మా మేనత్త కూడా క్రాన్ బెర్రీ పచ్చడితో తనదైన కొత్తదనాన్ని ఆవిష్కరించి, స్వంతంచేసుకుంది. అత్యంత ప్రీతిపాత్రమైన ఈ నోరూరించే వంటకం ఖండాంతర రుచులన్నింటిలో తనదైన ముద్రవేసి ఆంధ్ర-తెలంగాణలతో పాటు దక్షిణ-మధ్య, ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం దక్షిణ భారతాన్నంతా గర్వించేలా చేస్తుంది. సాధారణంగా పులుపు అన్ని దక్షిణ భారత ప్రాంతాల వంటకాలలో ప్రబలంగా ఉంటూ, విలక్షణమైన ఈ నేలను మరియు దాని ప్రజలను ఉత్తర భారతీయులకు భిన్నంగా నిలబెడుతుంది. సంక్లిష్టమైన ఈ ప్రత్యేక సంస్కృతీ, దానిని ఎగతాళిచేసే ఉత్తరభారతీయుల మందబుద్ధికి అర్ధం కావటం కొంచెం కష్టమే. చరిత్రకారుడు మరియు శాసన అధ్యయన కారుడైన కృష్ణస్వామి అయ్యంగార్, తమిళ మరియు సంస్కృత రాతప్రతుల ఆధారంగా రాసిన తన ‘తిరుపతి చరిత్ర’ (History of Tirupati) అనే ఒక ప్రాథమిక అధ్యయన గ్రంధంలోవెల్లడించినట్లు, నేటి ఆరాధన కేంద్రమైన ‘తిరుపతి’ని సాంప్రదాయకంగా ‘వెంగడం’ అనే పేరుతో పిలిచేవారని తెలిపారు. తమిళ నేలకు ఉత్తరంగా ఉన్న ఈ క్షేత్రానికి ఆవల నివసించేవారిని ‘వడుకు’, లేదా ‘తెలుగువారు’గా పిలిచేవారని ఈ సందర్బంగా తెలిపారు. ‘తొల్కాప్పియం’ అనే ప్రాచీన తమిళ వ్యాకరణ గ్రంధం ప్రకారం, ఉత్తర భాగంలో ‘వెంగడం’ మరియు దక్షణంలో ‘కుమారి’ (Cape Comarin, లేదా నేటి కన్య కుమారి) సరిహద్దులుగా తమిళ నేల విస్తరించి ఉన్నట్లుగా అయ్యంగార్ పేర్కొన్నారు. సంగమ యుగానికి చెందిన మామునాలార్ అనే తమిళ కవికి చెందిన 311 వ పద్యం ఆధారంగా, అయ్యంగార్ మరొక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు: “పుల్లి అనే సేనాపతి ఏలుబడిలోవున్న ఒక మంచి ప్రాంతంగా, మరియు అది ఒక ఎడారి లాంటి నేలగా గుర్తించారు. ఇక్కడి ప్రజలకు చింతపండు మరియు బియ్యంతో కలిపి వండిన ఒక ఆహారాన్ని టేకు ఆకులలో సేవించడం ఒక ఆచారంగా ఉన్నట్లు వివరించారు.” దక్షిణ ఆంద్ర ప్రదేశ్ లోనున్న తిరుపతి దేవాలయంలో భక్తులకు పంచిపెట్టే అనేక దైవ ప్రసాదాలలో పులిహోర/ పులియొదరై, లేదా చిత్రాన్నం/చింతపండు అన్నం (Tamarind Rice) ఒకటిగా మంచి ప్రాచుర్యం పొందింది. పులిహోర దక్షిణ భారతదేశం మొత్తంగా వినియోగంలోనున్న విషయం చాలా స్పష్టం. వివిధ రకాల బియ్యం, సుగంధద్రవ్యాలు, వాటి మోతాదులో పరిమానంలో హెచ్చుతగ్గులు, మరియు మసాలా ఘాటు తదితర తేడాల కారణంగా వైవిధ్యం ఉండవచ్చు. తెలుగు రకాలు, ప్రత్యేకించి కోస్తా ఆంధ్రలో, చాలా కారంగా ఉంటాయి. కానీ దాని మిశ్రమ రుచి కమ్మదనపు మూలం మాత్రం పులుపులోనే నిభిడీకృతమయివున్నది. ఈ పుల్లని, దివ్యమైన ఆహారం ఆలయ ప్రధానమైనది మాత్రమే కాదు. అది అన్ని కుటుంబ సమావేశాలలో సాధారణంగా వండే వంట. పులి అనేది ఇక్కడ కార్య-కారక సంభందంగల ఒక పదం. దాని అర్ధం పండు మరియు మొక్కకు వున్న సంభందాన్ని మాత్రమే కాకుండా, వాటి రుచి అయిన పులుపును కూడా సూచిస్తుంది.
ఆయుర్వేద గ్రంధాలలో వివరించిన ఆమ్లరసము, ఈ పులుపు లేదా ఆమ్లము (Acidity)కి సమాన అర్ధాన్నిచ్చే పదం. చరక సంహిత అనే ప్రాచీన ఆయుర్వేద గ్రంధంలో పలుమార్లు పేర్కొన్నట్లు, “ఆమ్లం హృద్యనం.” అంటే “పులుపు రుచి మనస్సును ఆహ్లాద పరుస్తుంది,” అని అర్ధం. సంస్కృత శాస్త్రీయ గ్రంధాల ప్రకారం, పులుపుకు సమాన అర్ధాన్నిచ్చే మరొక్క పదం, ‘చుక్ర.’ ఇది అనేక అర్ధాలను సూచిస్తుంది. అవి: ఒక రకమైన వెదురు కర్ర, పులియబెట్టిన ధాన్యము లేదా పండ్లు, రేగు పండు లేదా చింతపండు, చింతచెట్టు, మొదలైనవి. లభ్యమౌతున్న పరిశోధనా జ్ఞానం ప్రకారం, ఆయుర్వేద సాహిత్యంలో పేర్కొనబడిన ఆమ్లము అనే పదం, నిజానికి చింతపండేనా (Taamarindus Indica), లేదా ‘కోకం’ లాంటి మరేదైనా పులుపైన వస్తువా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.(Scholarly research ) అమరకోశం అనే ప్రాచీన సంసృత విజ్ఞాన సర్వస్వ గ్రంధంలో తింటిడి, చింకా మరియు ఆమ్లికలను, మరియు ఇతర గ్రంధాలలో తింటిడి, తిండిక్ మరియు వృక్ష ఆమ్లముగా పిలువబడే కోకం (Garcinia cambodjia or Garcinia indica) ను, చింతపండుకు పర్యాయ పదాలుగా పేర్కొనడం జరిగింది. ఈ పదాలలో కొన్నింటిని భారతదేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతీయ భాషలలో గుర్తించవచ్చు. హిందీలో ఇమ్లీ, మరాఠీలో చించా, కన్నడలో హులీ, లేదా హునాస-హన్ను మరియు తమిళ-మళయాళ భాషల్లో పులి గా పిలువబడుతున్న ఈ వస్తువు మరియు తెలుగులోని మన చింతపండు ఒకటే అని అర్ధం చేసుకోవచ్చు. అయితే, దీని ఆంగ్ల నామమైన tamarind మాత్రం, తమర్-ఇ-హింద్ అనే అరబిక్ పదం నుండి గ్రహించబడింది. దీనికి ఇండియన్ డేట్ అని మరోపేరు కూడా వుంది.
చింతపండు బహుశా గతంలో సముద్ర వాణిజ్య మార్గాలగుండా భారత దేశానికి చేరియుంటుంది. (Indigenous to the tropical Africa) ఈ చెట్టుకు ఉష్ణమండల ఆఫ్రికాకు చెందిన దేశీయ మూలాలున్నట్లు తెలుస్తుంది. సెనెగల్ రాజధాని నగరమైన డాకర్ ఈ చెట్టు పేరుతో ఉందని తెలుసుకోవడం ఒకింత ఆసక్తిని కలిగిస్తుంది. అనేక పోషక విలువలతో నిండిన ఈ మన్నికనిచ్చే ఆహారాన్ని అరబ్ మరియు ఇథియోపియాకు చెందిన వ్యాపారులు గుజ్జు రూపంలో (Tommar) మన దేశానికి తెచ్చి ఉంటారు. ఘాగ్రా నది ఒడ్డున ఉన్న నర్హన్ అనే ఒక ప్రదేశంలో జరిపిన పరిశోధనలో బయటపడ్డ చింత కలప మరియు దాని బొగ్గు అవశేషాలు కొత్తరాతి యుగం, లేదా తామ్ర శిలా యుగానికి చెందినవిగా, సుమారు క్రీ. పూ. 1300 B. C. నాటివిగా, పురాతత్వ పరిశోధకులు గుర్తించారు. దీని ఆధారంగా, పూర్వ చారిత్రిక యుగంలోనే ఖండాంతర వాసుల మధ్య సంక్లిష్ట సంభందాలు, రాకపోకలు జరిగాయని, మరియు వారు పరస్పరం మిళితమై సామూహిక జీవన సౌరంభాలను ఏర్పరుచుకున్నారని మరోసారి నిరూపించబడింది.
దక్కన్‌లో జరిగిన భారత -ముస్లిం సమ్మేళనం అద్భుతమైన కళలకు మరియు భవన నిర్మాణాల అభివృద్ధికి తోడ్పాటునందించింది. ఈ కాలమే దక్కన్ సాహిత్యానికి ఒక వెలుగురేఖనందించింది. భాషా ఔన్నత్యంలో ఒక స్వర్ణయుగంగా పిలువబడి, 350 సంవత్సరాలపాటు నిర్విరామంగా విలసిల్లిన ఈ నేల, 17 వ శతాబ్దపు చివరి భాగంలో ఔరంగాజేబు ప్రవేశంతో మరియు అతని సామ్రాజ్యవాద పదఘట్టనలకింద ఆ భాషా-సంస్కృతులన్నీ నలిగిపోయాయి. అలాంటి మనోహరమైన అనేక సంస్కృతుల సమ్మిళిత భాగస్వామ్య చారిత్రిక వారసత్వంలో భాగమే ఈ ఆహార సంస్కృతీ. ఇప్పుడు కేవలం మౌఖిక భాషగా కొనసాగుతున్న దక్కనీ భాష మరియు దాని విలక్షణమైన రుచులుగొలిపే ఆహార సంస్కృతులు పరస్పరం ప్రభావితం చెంది సమ్మోహానం చెందగలవా? దీని ప్రాధాన్యతని దక్కన్‌లోని కొంతమంది ఆధునిక కవులు సృజనాత్మకంగా అన్వయించడాన్ని గమనించవచ్చు. వారిలో ప్రముఖ దివంగత రచయిత సర్వర్ దండా ప్రచురించిన తన రచనల సంపుటి ‘ఇమ్లీబన్’ (చింత తోట) అనే శీర్షికను కలిగి ఉండగా, దేశ విభజనానంతరం పాకిస్తాన్‌కు వలస వెళ్లిన కవి, ఐజాజ్ హుస్సేన్ మాత్రం “ఖట్టా” అనే కలం పేరుతో తన రచనలు చేసేవారు. బహుశా ఆ పేరు అతని సాధారణ వైఖరిని సూచిస్తూ, తన రచనలకు పులుపుదనానికి గల సారూప్యతను ఒక కటువైన ప్రతినాయకునితో సరిపోల్చి చూపి ప్రభావవంతంగా చెప్పడానికేనేమో. నిజానికి, దక్కన్ మరియు దాని ప్రజలకు వ్యక్తీకరణలో ఒక విడదీయరాని సంభందం వుంది. వీరు ఇష్టానుసారంగా తన స్వేచ్ఛ-స్వాతంత్రాలను చాటుతూనే, అప్పుడప్పుడు తన దుందుడుకుతనాన్ని ప్రదర్శిస్తుంటుంటారు. దీన్ని ప్రస్తావిస్తూ, ఐజాజ్ హుస్సేన్ (ఖట్టా) ఈ క్రింది విధంగా ఒక ద్విపద-కావాన్ని మనకందించారు. అది:
ఖట్టే కి లాష్ ఖద్దే మే నంగి-ఇచ్ గాడ్ దో; ఉస్కే కఫన్ కో ఘైర్ కి చద్దర్ నక్కో-ఇచ్ నక్కో
(ఖట్టా శవాన్ని తన సమాధిలో నగ్నంగా పూడ్చివేయండి; మరొకరి వస్త్రం దానికి సరి తూగదు, సరితూగదు కాక సరితూగదు.)
కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) కి డైరెక్టర్ గా సేవలందించిన భారత మాజీ పోలీసు అధికారి విజయ్ కరణ్, తన భార్య ప్రతిభా కరణ్ హైదరాబాద్ వంటకాలపై రాసిన ఒక పుస్తకానికి పరిచయ వాక్యాలు వ్రాస్తూ, “పులుపు ప్రదానంగా తన ప్రత్యేకతను చాటిచెప్పుతున్న హైదరాబాదు ఆహారం, స్పష్టంగా తెలుగు ప్రభావంతోనే రూపుదిద్దుకుంది. అదేవిధంగా హైదరాబాద్ వాళ్లు వండినంత పుల్లని ఆహారాన్ని మరెవరూ చేయలేరు” అని తెలిపారు: విజయ్ కరణ్ హైదరాబాదు మొదటి నిజాం అయిన మీర్ ఖమరుద్దీన్ నిజాం-ఉల్-ముల్క్ అసఫ్ జా-I తో పాటు దక్కన్ ప్రాంతానికి వలస వచ్చిన సహనశీలియైన రాజా సాగర్ మాల్ వంశానికి చెందినవాడు. దక్కనీ రుచుల ఈ సంక్లిష్టత మరియు విలక్షణత చిగుర్ కా సాలన్, లేదా చిగుర్ గోష్ట్ అనే ప్రత్యేకమైన వంటకంలో వ్యక్తీకరించబడుతుంది. మటన్ లో చింత చిగురు, లేదా లేత చింతాకులు వేసి ఉడికించడం ద్వారా ఈ వంటకాన్నితయారు చేస్తారు. ఏప్రిల్ నెలలో ఎండబెట్టిన చింత చిగురుతో కందిపప్పుతోపాటు, అనేక ఇతర వంటలను వండుతారు. మాంసాలలో మరియు పప్పుల్లో పుల్లని ఆకు కూరలు వేసి వండడం ఈ ప్రాంతం మొత్తంలో సర్వసాధారణం. దక్కన్ మరియు మరాఠా ప్రాంతాలలో అంబడాగా పిలువబడుతున్న ఇంతకు ముందే ప్రస్తావించిన గోంగూర (రోసెల్లె)ను ఇక్కడి వంటలలో విరివిగా వాడుతారు. “జొవార్ కి రోటీ, అంబాడ్ కి భాజీ” (పుల్లని ఆకు కూరతో కూడిన జొన్న లేక సోర్ఘం రొట్టె) అంటూ ఈ ప్రాంతీయ భోజనంగా దక్కనీ జానపద పాటలలో ప్రస్తావించబడింది. ప్రఖ్యాత హైదరాబద్ వంటకాలైన మిర్చి కా సాలన్, బఘారా బైంగన్ మరియు తమతర్ కుట్, తదితరాలు దక్కనీ ఆహార సంప్రదాయాలలో చింతపండును ఉత్సాహంగా వాడుతారనడానికి నిదర్శనం.
మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన శివాజీ కుమారుడు శంభాజీ గౌరవార్థం తంజావూరును పాలించిన మరాఠా పాలకుడు షాహాజీ రాజు వంటశాలలో సాంబార్ కనిపెట్టినట్లు చెప్పబడింది ఒక కల్పితకతే అయినప్పటికీ, అది పుల్లని రుచిగల ఆహారపదార్థాల పట్ల వారికిగల మక్కువను సూచిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సాంబార్ మరియు అందులో వాడే చింతపండుతో సహా ఇతర ఆహార దినుసుల గురించిన ప్రస్తావనను విజయనగర రాజు కృష్ణదేవరాయలు తన ‘అముక్తమాల్యద’ అనే సంక్లిష్ట పురాణ కావ్యంలో ప్రస్తావించినట్లు శ్రీనివాస్ సిస్ట్లా అనే పరిశోధక రచయిత గుర్తించారు.(scholar Srinivas Sistla writes) అంతేకాకుండా, ప్రబంధ పద్య రచనలో పేరెన్నికగన్న 15వ శతాబ్దపు తెలుగు మేటి కవి శ్రీనాథుని కవిత్వంలోనూ మరియు సాధువుగా జీవించిన భక్త -కవి తాళ్లపాక అన్నమాచార్య తెలుగు కీర్తనల్లోనూ పులుపు మరియు చింతపండును గురించిన ప్రస్తావనలున్నట్లుగా సిస్ట్లా వివరించారు. పులుపు తీపిల మిశ్రమం, మనిషిలోని మంచి చెడుల నడుమ సాగే సున్నితమైన సమతుల్యంగా, అన్నమయ్య ఒక తెలుగు కీర్తన(స్తోత్రం)లో పోల్చిచూపారని సిస్ట్లా వెల్లడించారు. అన్నమయ్య మాటల్లో చెప్పాలంటే అది, “పులుపు-తీపు-ను-కలాపి-భుజిచి-నట్లు.”
రుచులు మరియు అభిరుచులు తరచుగా భావోద్వేగాలతో ముడిపడి ఉండడం మూలంగా, పులుపు (మరియు పుల్లదనం) అనే పదం ప్రతికూల అర్థాలతో బాధపడుతోంది. పుల్లదనం అనేది నా భాషా-సంస్కృతిలో, ఈర్ష్య మరియు అసూయలకు సంభందించినది. పులుపుతో ముడిబడిన Sour face, sour grapes, sour as vinegar, relationships gone sour, things ending on a sour note, leaving a sour taste in one’s mouth, sourpuss లాంటి అనేక ఆంగ్ల పదబంధాలు మరియు జాతీయాలు ప్రతికూల భావనలను వ్యక్తీకరించడం ద్వారా, దానిలో ఉండే అనేక రుచి సంభందిత సత్ఫలితాలన్నీ విష్మరించబడ్డాయి.
పుల్లని ఆహారాన్ని స్వీకరించడం వలన జరిగిన పరిణామాత్మక మార్పులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. లాక్టిక్ ఆమ్లపు దుష్ప్రభావాన్ని నిరోధించే క్రమంలోనే ఆది మానవులు పుల్లని/పండు కుళ్ళిన వాసనగల ఆమ్ల పదార్థాలను తినడానికి సురక్షితమైనవిగా అర్థం చేసుకొని ఉండవచ్చునని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. పుల్లని ఆహారాన్ని మితంగా తీసుకోవడం వల్ల సంభవించే సత్ఫలితాలు మనకు చాలా కాలంగా తెలుసు. సమ-శీతోష్ణ మండల వాతావరణం కారణంగా, దక్కన్ పీఠభూమి చింతపండు మరియు ఇతర పుల్లని పండ్లకు అనువైన ప్రదేశమై ఉండవచ్చు. ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ మార్పుల కారణంగా ఫుజి యాపిల్స్ పుల్లదనాన్ని సంతరించుకోవడం గమనించినట్లు తాజా అధ్యయనాల ద్వారా తెలుస్తున్నది. భారతీయ యాపిల్ రైతులు కూడా దీని ప్రభావానికి గురయ్యారు.
హైదరాబాద్‌లోని తెలుగు ఇంటిలో పెరగడం మూలంగా నాలో పేరుకు పోయిన ప్రాంతీయ పక్షపాత వైఖరి చెక్కు చెదరలేదు. చాలా కాలంగా బొంబాయి నివాసిగా ఉన్న నేను ఇప్పుడు ఊరగాయలు మరియు పచ్చడిని ఉపయోగించడంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ, దాని సంభందిత జ్ఞానము మరియు రుచి ఇప్పటికీ నన్ను అంటిపెట్టుకొనే ఉన్నాయి. కోకుమ్ మొదలు, నారింజ /నిమ్మ, టొమాటో, పచ్చి మామిడి, వెనిగర్, పెరుగు వరకు పుల్లదానాన్నిచ్చే అనేక పదార్తాలను డెక్కన్ ప్రాంత వాసుల ఆహారంలో ఉపయోగిస్తూనే ఉన్నారు. హైదరాబాదులోని కొన్ని ఇరానీ కుటుంబాల వాళ్లు పచ్చ ద్రాక్షను విరివిగా ఉపయోగిస్తుటారు. సంఖ్యా పరంగా పులుపు ఆహార పదార్థాల జాబితా భారీగానే ఉంది. రాయలసీమకు చెందిన చేపల పులుసు మొదలు, పశ్చిమ దక్కన్‌లోని సోల్ కడి, తమిళ వారి వాతల్ కొజంబు, కృష్ణా-గోదావరి పరివాహక ప్రాంతంలోని దప్పళం మరియు కేరళలోని ఇంజిపులి వరకు ఇలా చెప్పుకుంటూ పొతే దానికి అంతమే లేదు.
నా అనుభవంలో పప్పు పులుసు (పుల్లని పప్పు) అనే ప్రతి రోజూ ఇంట్లో వండుకునే వంటకం నన్ను ఎప్పటికీ అబ్బురపరిచే పుల్లని ఆహారం. దీని వైవిధ్యమేమంటే, వండిన పప్పు (పెసరు లేదా కంది)ని పొయిమీదినుండి దించే ముందు, నీటిలో నానబెట్టిన చింతపండు గుజ్జుతోపాటు, తక్కువ మంటపై నెయ్యిలో ముదురు గోధుమ రంగుదాల్చే వరకు వేయించిన మసాలాలు మరియు పాక్షికంగా నల్లబడేవరకు వేగించిన చిన్న వెల్లుల్లి పాయలను ఆ ఉడికించిన పప్పుతో కలపాలి. ఇలా నెమ్మదిగా ఉడికినప్పుడు, వెల్లుల్లి పాయలు తన ఘాడమైన వాసనను మరియు రుచిని ఆ చింతపండు రసంలో విడుదల చేస్తాయి. నేను ఈ రుచిని వివరించడానికి కష్టపడ్డాను. చివరగా నేనాస్వాదించిందేమంటే, చాలా రోజులుగా మతిపోగోట్టే విషజ్వర పీడననుండి విముక్తి చెందడంవల్ల తిరిగి నెలకొన్న రుచి, వాసన, రూపము మరియు దృశ్య విలాసాలన్నీ ఒక్కసారి ఆవహించుకున్న అనుభవం. ఒక అచేతనావస్థ నుండి తిరిగి చేతనా స్థితిని అధిగమించడం. ఈ చేతనోన్నతిలో అంతర్లీనం చెందుతున్నాయా అన్నట్లుగా, 1970ల నాటి ప్రాచుర్యం చెందిన కొన్నిబ్రిటీష్ పాప్ సంగీతపు పాటలు.
పులుపు అనేది రుచులన్నింటిలో మొండిది. మరియు దాని మొండితనం శాశ్వతంగా నిలుస్తుంది. ఎలాగంటే, ఒక పాత తెలుగు సామెత చెప్పినట్లు: “చింత చచ్చినా, పులుపు చావదు,” లేదా “చింతచెట్టు చనిపోవచ్చు, కానీ దాని పులుపు మాత్రం ఎప్పటికీ చావదు.”